Smartphone | న్యూఢిల్లీ, జూన్ 3: మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ను గానీ యాపిల్ ఐఫోన్‌ను గానీ వాడుతున్నారా? అయితే మీ ఫోన్లను భద్రంగా ఉంచుకోవాలంటే ప్రతి వారం రోజులకోసారి వాటిని తప్పనిసరిగా రీస్టార్ట్ చేయాలని అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్ఏ) సూచించింది. సైబర్ నేరగాళ్ల నుంచి స్మార్ట్ఫోన్లను సురక్షితంగా ఉంచుకునేందుకు పాటించాల్సిన పద్ధతులను వివరిస్తూ కొన్నేండ్ల క్రితం ఎన్ఎస్ఏ రూపొందించిన ఓ డాక్యుమెంట్ ఇటీవల బయట పడింది.
సైబర్ దాడులతోపాటు మాల్వేర్ బారిన పడకుండా ఉండాలంటే వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లను వారానికోసారి రీస్టార్ట్ చేసుకోవాలని ఆ డాక్యుమెంట్లో ఎన్ఎస్ఏ సూచించినట్టు ‘ఫోర్బ్స్’ పత్రిక వెల్లడించింది. 2010 తొలినాళ్లలో తయారైన ఫోన్లను, ముఖ్యంగా హోం బటన్ కలిగిన ఐఫోన్లతోపాటు కొన్ని శాంసంగ్ గెలాక్సీ డివైజ్‌ల గురించి ప్రస్తావిస్తూ ఎన్ఎస్ఏ ఈ సూచన చేసినట్టు తెలిపింది. ఇది ఇప్పటికీ విలువైన సూచనేనని, స్మార్ట్ఫోన్లను రీస్టార్ట్ట్ చేయడం ద్వారా కనీసం కొన్ని సైబర్ దాడులనైనా నిరోధించవచ్చని ఆ పత్రిక పేర్కొన్నది.