శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్ ( Encounter ) జరిగింది. ఈ ఎన్కౌంటర్లో గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యాడు. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. కుప్వారా జిల్లాలోని జుమాగఢ్ ఏరియాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉగ్రవాది తారసపడగా లొంగిపొమ్మని హెచ్చరించారు. కానీ అతను పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ ఉగ్రవాది హతమయ్యాడు. ఇంకా ఉగ్రవాదులు దాగి ఉన్నారనే అనుమానంతో పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.