న్యూఢిల్లీ: మన దేశంలో క్రికెట్ అంటే ఒక పండుగ..! ఒక ఉత్సవం..! దేశంలోని లక్షలాది మంది క్రికెట్ ప్రియుల భావోద్వేగం..! భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడుతుందంటే చాలు.. ఇండియన్ క్రికెట్ ప్రియులు ఎక్కడ ఉన్నా, ఏ పనుల్లో ఉన్నా ఆ మ్యాచ్‌కు సంబంధించిన అప్డేట్స్ కోసం అన్ని మార్గాలను అన్వేషిస్తారు. ప్రత్యేకించి మ్యాచ్ స్కోర్ తెలుసుకునేందుకు తెగ ఆరాటపడుతుంటారు. అలాంటి ఓ క్రికెట్ అభిమాని.. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా, భారత్ మధ్య జరిగిన మ్యాచ్ అప్డేట్ కోసం ఏం చేశాడో తెలుసా..?
ఆదివారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో సదరు ప్రయాణికుడు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నాడు. కానీ అతని మనసంతా మ్యాచ్ మీదే ఉంది. ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ ఫోన్లోనో, ల్యాప్‌టాప్‌లోనో మ్యాచ్ చూసే అవకాశం లేదు. అయినా మ్యాచ్ స్కోర్ తెలుసుకోకుండా అతను ఉండలేకపోయాడు. చివరికి మ్యాచ్ స్కోర్ గురించి ఆ ఫ్లైట్ పైలట్‌నే ఆరా తీశాడు. దాంతో పైలట్ మ్యాచ్ స్కోరును ఓ కాగితం మీద రాసిచ్చాడు. దానిపై ఇండియా 133/9, దక్షిణాఫ్రికా 33/3, 6 ఓవర్స్ అని రాసి ఉంది.
విక్రమ్ గార్గా అనే ఆ ప్రయాణికుడు తనకు పైలట్ ఇచ్చిన స్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఇండియా మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. ఇండిగో నా మనసు దోచుకుంది అని ఇంగ్లిష్‌లో దానికి క్యాప్షన్ ఇచ్చాడు. విక్రమ్ గార్గా పోస్టుకు ఇండిగో కూడా స్పందించింది. మీ ట్వీట్‌ను చూడటం మాకు చాలా సంతోషాన్నిచ్చింది, మీరు మరోసారి మా విమానంలో ప్రయాణించాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్కరోజులోనే 373 లైకులు వచ్చాయి. 25 మంది రీట్వీట్ చేశారు.
India lost today but @IndiGo6E won my heart. Pilot sent a note mid air when requested for score update.#momentsthatmatter pic.twitter.com/XngFXko63T
— Vikram Garga (@vikramgarga) October 30, 2022