న్యూఢిల్లీ : మద్యం మత్తులో ఉన్న ఒక మహిళను తన ఇంటికి తీసుకువచ్చిన భారతీయ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాది యూకేలో జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపగా కోర్టు ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. భారత్‌కు చెందిన 20 ఏండ్ల ప్రీత్ వికాల్ ఇంగ్లండ్‌లోని కార్డిఫ్ నగరంలో చదువుతున్నాడు. జరిగిన ఘటన గురించి బాధితురాలు అధికారులకు ఇటీవల ఫిర్యాదు చేసింది.
మత్తులో ఉన్న తనపై జరిగిన అఘాయిత్యాన్ని మర్చిపోలేకపోతున్నానని, పీడ కలలా తనను వెంటాడుతున్నదని ఆమె ఆవేదన చెందింది. దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌లు పరిశీలించారు. పబ్ బయట నిందితుడు ఆమెను భుజాలపైన మోసుకుని వెళ్లడం, ఫ్లాట్‌లోకి తీసుకు వెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఆధారాలతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు విచారించిన కోర్టు అతడికి ఏడేళ్ల జైలు శిక్షను విధించింది.