న్యూఢిల్లీ, డిసెంబర్ 25: బంగ్లాదేశ్‌లో బుధవారం రాత్రి జరిగిన మూకదాడిలో మరో హిందువు మరణించాడు. ఇటీవలే దీపూ చంద్ర దాస్ అనే హిందూ కార్మికుడిని మూకలు హత్యచేసి అతని మృతదేహాన్ని తగలబెట్టిన ఘటనను మరువకముందే మరో దారుణ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. పంగ్షా ఉప జిల్లాలోని రాజ్బరీలో బుధవారం రాత్రి అమృత్ మోండల్ అలియాస్ సామ్రాట్ అనే 29 ఏళ్ల వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి చంపేశారు. సామ్రాట్ వాహిణి అనే ఓ క్రిమినల్ గ్యాంగుకు నాయకుడైన సామ్రాట్ బెదిరింపు వసూళ్లకు పాల్పడేవాడని స్థానికులు బంగ్లాదేశీ పత్రిక ది డైలీ స్టార్‌కు తెలిపారు.
గత ఏడాది ప్రధాని షేక్ హసీనా దేశాన్ని వీడిన తర్వాత సామ్రాట్ కూడా దేశం విడిచి పారిపోయాడు. ఇటీవలే తన గ్రామానికి తిరిగివచ్చిన సామ్రాట్‌పై తన గ్యాంగు సభ్యులు కొందరిని వెంటబెట్టుకుని షాహీదుల్ ఇస్లాం అనే గ్రామస్తుడి ఇంటికి వెళ్లి డబ్బు కోసం బెదిరించాడు. వీరిని చూసి దొంగలని భావించిన ఆ ఇంట్లోని వారు గట్టిగా కేకలు వేయడంతో ఇతర గ్రామస్తులు అక్కడకు చేరుకుని సామ్రాట్‌ని పట్టుకుని చితకబాదారు. ఇతర గ్యాంగు సభ్యులు పారిపోగా సామ్రాట్ మాత్రం దొరికిపోయాడు. మూకల నుంచి సామ్రాట్‌ని రక్షించి దవాఖానకు తరలించగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారని ఏఎస్పీ దేబ్రతా సర్కార్ తెలిపారు. పంగ్షా పోలీసు స్టేషన్లో హత్య కేసుతోసహా సామ్రాట్‌పై రెండు కేసులు నమోదై ఉన్నట్లు ఆయన చెప్పారు.