న్యూఢిల్లీ : విమానాలకు వరుస బెదిరింపుల వేళ ఎయిర్ ఇండియా విమానంలో మందుగుండు కాట్రిడ్జ్(తూటా) లభించడం కలకలం రేపింది. అక్టోబర్ 27న దుబాయ్ నుంచి న్యూఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ916లోని సీటు పాకెట్లో ఇది దొరికినట్టు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అప్పటికే ప్రయాణికులు అందరూ దిగిపోయారని పేర్కొన్నారు. కాట్రిడ్జ్ దొరికిన వెంటనే ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం అందించినట్టు తెలిపారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు నేపాల్ నుంచి న్యూఢిల్లీ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. నాలుగు గంటల తనిఖీల అనంతరం బెదిరింపు కాల్ ఉత్తదేనని తేల్చారు.