Amit Shah | వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించబోతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మధురైలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఏఐఏడీఎంకే కలిసి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జోష్యం చెప్పారు. పశ్చిమ బెంగాల్లో సైతం ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తమిళనాడు ప్రజలు మార్పును కోరుకుంటున్నారని.. బీజేపీ కార్యకర్తలు పార్టీని గెలిపించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని షా పేర్కొన్నారు. అమిత్ షా డీఎంకేను ఓడించలేరని ఎంకే స్టాలిన్ అంటున్నారని.. ఆయన చెప్పింది నిజమేనని.. ఆయనను తాను ఓడించలేనని.. తమిళ ప్రజలు ఓడిస్తారన్నారు. ఈ సందర్భంగా రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి సమీక్షించారు. రాష్ట్ర నాయకులతో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
తమిళనాడు ప్రజలు డీఎంకే ప్రభుత్వ అవినీతితో విసిగిపోయారని.. బీజేపీ కార్యకర్తలు ప్రతి వీధి, పరిసరాలు, ఇంటింటికి చేరుకుని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారని ఎక్స్పోస్ట్లో పేర్కొన్నారు. గత పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు రూ.6.80లక్షల కోట్లు ఇచ్చిందని షా పేర్కొన్నారు. అయినా రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందని స్టాలిన్ అడుగుతున్నారన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారో లేదో చెప్పాలని స్టాలిన్ను డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణానికి సమానమైన డబ్బుతో తమిళనాడులోని ప్రతి పాఠశాలలో కనీసం రెండు తరగతి గదులు నిర్మించి ఉండవచ్చన్నారు. ఇదిలా ఉండగా.. అమిత్ షా అంతకు ముందు మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి షా మాట్లాడుతూ.. తమిళంలో మాట్లాడలేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. భారతదేశంలోని గొప్ప భాషల్లో ఒకటైన తమిళంలో తాను మాట్లాడలేనని.. అందుకు పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.