Arvind Kejriwal : కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) కు ఆప్ కన్వీనర్ (AAP convenor) అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సవాల్ విసిరారు. ఢిల్లీని మేనేజ్ చేయడం నీకు చేతగాకపోతే ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని అన్నారు. నగరంలోని 1.25 కోట్ల సోదరీమణులు ఆ సంగతి చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని సమస్యలు అన్నింటినీ సరిచేస్తారని చెప్పారు.
ఢిల్లీలో రెండు ప్రభుత్వాలు ఉన్నాయని, అందులో ఒకటి కేజ్రీవాల్ ప్రభుత్వమైతే, ఇంకోటి కేంద్ర ప్రభుత్వమని కేజ్రీవాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నగరంలో పాలు, కూరగాయలు, పప్పులు, బియ్యం ధరలను భారీగా పెంచిందని ఆయన విమర్శించారు. వారు ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ పోతుంటే.. తాము మాత్రం ప్రజలకు అన్నీ ఉచితంగా వచ్చేలా చూస్తున్నామని అన్నారు.
ఇప్పుడు మీ ఖాతాల్లోకి రూ.2,100 వేస్తున్నామని, దాంతో బీజేపీ కేజ్రీవాల్ ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నాడని విమర్శిస్తోందని ఢిల్లీ మహిళలను ఉద్దేశించి కేజ్రీ అన్నారు. మహిళలు బాగుపడటం బీజేపీకి ఇష్టంలేదని ఆయన చెప్పారు. వాళ్లెప్పుడూ దూషణలు చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీకి ఎలాంటి అజెండా లేదని అన్నారు.