NTRO | న్యూఢిల్లీ, నవంబర్ 3: భారత సాంకేతిక గూఢచారి విభాగం (ఎన్టీఆర్ఓ)పై ఆధిపత్యం కోసం కేంద్రంలోని ఇద్దరు ప్రముఖులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్టీఆర్ఓ కొత్త చీఫ్ నియామకంపై కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ మధ్య వివాదం ఏర్పడింది. ప్రస్తుత చీఫ్‌గా ఉన్న ఐపీఎస్ అధికారి అరుణ్ సిన్హా అక్టోబర్ 31న పదవీ విరమణ చేసినా, మరో రెండు నెలల పాటు డిసెంబర్ 31 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. వాస్తవానికి ఎన్టీఆర్వో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నేతృత్వంలోని జాతీయ భద్రతా మండలికి జవాబుదారీ. అయితే హోం మంత్రి అమిత్ షా ఇందులో జోక్యం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఎన్టీఆర్ఓ చీఫ్ పదవికి సీఆర్పీఎఫ్ చీఫ్‌గా ఉన్న అనీశ్ దయాల్ సింగ్ పేరును హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తూ ఫైల్‌ను పంపింది. అయితే ఆ ఫైల్‌పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా పీఎంవో దానిని వెనక్కి పంపింది. గతంలో ఈ పదవికి మనోజ్ యాదవ్ (ఆర్పీఎఫ్ చీఫ్), రష్మీ రంజన్ స్వయిన్ (సీఐడీ డీజీ)ల పేర్లను అజిత్ ధోవల్ ప్రతిపాదించగా, దానిని హోం శాఖ అప్పట్లో తిరస్కరించింది. దానిని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు అమిత్ షా సిఫార్సు చేసిన వ్యక్తిని ధోవల్ తిరస్కరించినట్టు ప్రచారం జరుగుతున్నది.