న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శత్రు దాడి నుంచి పౌరుల రక్షణ కోసం మే 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని పలు రాష్ట్రాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. (Mock Drills On May 7) సమర్థవంతమైన పౌర రక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లను పరీక్షించాలని, శత్రు దాడి జరిగినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి పౌరులు, విద్యార్థులకు పౌర రక్షణపై శిక్షణ ఇవ్వాలని తెలిపింది.
కాగా, అత్యవసర సమయంలో విజిబిలిటీని తక్కువ చేసేందుకు క్రాష్ బ్లాక్అవుట్ చర్యలు, కీలకమైన ప్లాంట్లు, ఇన్స్టాలేషన్లను కాపాడుకునేందుకు మభ్యపెట్టే విధంగా చర్యలు చేపట్టడం, జాతీయ ముప్పు ఎదురైనప్పుడు ప్రజల్లో అవగాహన పెంచడం, వేగంగా ప్రతిస్పందించడం, ప్రజలను ఖాళీ చేయించే ప్రణాళికలు, రిహార్సల్ వంటివి ఈ మాక్ డ్రిల్ లక్ష్యాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఏఏ రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి అన్నది స్పష్టంగా తెలియలేదు.
మరోవైపు ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగి ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత సీమాంతర ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు చర్యలు చేపట్టింది. అలాగే ప్రధాని మోదీ త్రివిధ దళాల చీఫ్‌లు, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌పై సైనికపరమైన చర్యను భారత్ చేపట్టవచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ చేపట్టాలన్న కేంద్ర హోంశాఖ ఆదేశాలు దీనికి మరింత ఊతమిస్తున్నది.