చెన్నై: తమిళనాడుకు చెందిన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)లో చీలికలు వస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ (S Ramadoss) అప్రమత్తమయ్యారు. కుమారుడు అన్బుమణిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. పీఎంకే చీఫ్ పదవిని తిరిగి ఆయన చేపట్టారు. విల్లుపురం జిల్లాలోని తైలాపురంలో జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు అధ్యక్షుడిగా పనిచేస్తానని, కుమారుడు అన్బుమణి వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతాడని ప్రకటించారు.
కాగా, 2024 డిసెంబర్లో పుదుచ్చేరిలో జరిగిన పార్టీ కౌన్సిల్ సమావేశంలో ఎస్ రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి మధ్య బహిరంగంగా ఘర్షణ జరిగింది. కుమారుడి నేతృత్వంలోని పార్టీ బీజేపీ వైపు మొగ్గుచూపడంతో వస్తున్న చీలిక పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వన్నియార్ హక్కుల సాధన లక్ష్యంగా ఏర్పడిన పీఎంకే భవిష్యత్తు, ద్రావిడ పార్టీలతో పొత్తు దృష్ట్యా అధ్యక్ష పదవిని ఎస్ రామదాస్ తిరిగి చేపట్టాలని పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్గా ఆయన పగ్గాలు చేపట్టారు.