కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పలు అంతర్గత సమస్యలను ఎదుర్కొంటున్నది. తిరుగుబాటు నేపథ్యంలో తాజాగా పార్టీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేయాలని కోరుతూ టీఎంసీ నేత బ్యాంకుకు లేఖ రాయడం మరో వివాదానికి దారి తీసింది. (TMC bank account freeze) టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి నమ్మకస్తుడైన మాజీ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్, హెడీఎఫ్సీ బ్యాంకు కోల్‌కతా బ్రాంచ్‌కు ఒక లేఖ రాశారు. పార్టీకి చెందిన పార్లమెంటరీ, శాసనసభ విభాగాలలో ఏర్పడిన చీలికను ఆయన ప్రస్తావించారు. పార్టీ ఖాతాలోని అన్ని ఆర్థిక లావాదేవీలను నిలిపివేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.
కాగా, ‘పార్టీకి చెందిన గణనీయ సంఖ్యలో ప్రజాప్రతినిధులు.. అంటే 28 మంది ఎంపీలలో 20 మంది, 60 మంది ఎమ్మెల్యేలలో 58 మంది పార్టీని వీడటం లేదా బహిరంగంగా తిరుగుబాటు చేయడం అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో, పార్టీ వ్యవహారాలు, ఆస్తుల నిర్వహణ, నియంత్రణ, అధికారానికి సంబంధించి తీవ్రమైన వివాదం తలెత్తింది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే టీఎంసీని చట్టబద్ధంగా ఎవరు నియంత్రిస్తున్నారనే దానిపై ‘తీవ్రమైన వివాదం’ ఉన్నదని అరూప్ బిశ్వాస్ ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ పరిణామాల వల్ల తిరుగుబాటు నాయకులు సంతకం చేసిన చెక్కులు ప్రస్తుతం చలామణిలో ఉన్నా లేదా వివాదాస్పద అధికారం కలిగిన వ్యక్తుల వద్ద ఉన్నా, అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ నేపథ్యంలో పార్టీ నిధులను రక్షించే ఉద్దేశంతో యథాతథ స్థితిని కొనసాగించాలని, పార్టీ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఎటువంటి డెబిట్ లావాదేవీలను లేదా నిర్వహణ అధికారాలలో మార్పులను అనుమతించవద్దని మీ కార్యాలయాన్ని కోరుతున్నా’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు తృణమూల్ మాజీ కోశాధికారి అయిన అరూప్ బిశ్వాస్, పార్టీ కోశాధికారిగా పేర్కొంటూ జూన్ 16న హెడీఎఫ్సీ బ్యాంకుకు ఈ లేఖ రాయడం మరో అంతర్గత వివాదానికి దారి తీసింది. అయితే అరూప్ బిస్వాస్ పార్టీ కోశాధికారిగా లేరని టీఎంసీ స్పష్టం చేసింది. పునర్వ్యవస్థీకరణ చర్యలో భాగంగా అన్ని పార్టీ యూనిట్లను మమతా బెనర్జీ రద్దు చేసినట్లు పేర్కొంది. టీఎంసీ శాసనసభ పక్షంలో జరిగిన నాటకీయ తిరుగుబాటు నేపథ్యంలో జూన్ 5న సుభాషిష్ చక్రవర్తి కోశాధికారిగా నియమితులైనట్లు ఆ పార్టీ రెబల్ వర్గం వెల్లడించింది.