న్యూఢిల్లీ: దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని భారతీయ చమురు కంపెనీలు తెలిపాయి. (No shortage of fuel) దీని గురించి జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఎల్పీజీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాయి. ప్రజలు భయపడి ముందుగా కొనుగోలు చేయడం లేదా నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. శుక్రవారం ఈ మేరకు ప్రజలకు హామీ ఇచ్చాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) వేర్వేరు ప్రకటనలు జారీ చేశాయి. తగినంత స్టాక్ లభ్యతపై హామీ ఇచ్చాయి.
కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఇంధనం కొరత ఏర్పడుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు పెరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో భారతీయ చమురు కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ స్పందించాయి. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని దేశ ప్రజలకు భరోసా ఇచ్చాయి. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు దేశంలో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నాయి. పెట్రోల్ బంకుల వద్ద అనవసరమైన రద్దీని నివారించాలని, మెరుగైన సేవలందించడంలో సహకరించాలని చమురు సంస్థలు కోరాయి.