Blue Dart | దేశంలోని ప్రముఖ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్ (Blue Dart ) తాజాగా కీలక ప్రకటన చేసింది. కేంద్రం ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చబోతోందన్న వార్తల నేపథ్యంలో ఇండియాలోని తమ ప్రీమియం సర్వీస్ డార్ట్ ప్లస్ (Dart Plus) బ్రాండ్ పేరును భారత్ ప్లస్ (Bharat Plus)గా మారుస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ సర్వీసులు భారత్ డార్ట్ (Bharat Dart) పేరుతో కొనసాగనున్నట్లు వెల్లడించింది. ఈ వ్యూహాత్మక మార్పు బ్లూ డార్ట్ ప్రయాణంలో ఒక మైలురాయిని సూచిస్తుందని అభిప్రాయపడింది. భారత విభిన్న అవసరాలను తీర్చడంలో తిరుగులేని నిబద్ధతను తెలియజేస్తుంది బ్లూ డార్ట్ పేర్కొంది.
కాగా, బ్లూ డార్ట్‌ను భారత్ డార్ట్‌గా మార్చేందుకు గల కారణాలను సంస్థ వివరించింది. తమ వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఒక విస్తృతమైన ఆవిష్కరణ, పరిశోధన ప్రక్రియ నుంచి వచ్చినట్లు తెలిపింది. తమ కంపెనీ భారత్‌ను ప్రపంచంతో కలిపేందుకు, ప్రపంచాన్ని భారత్‌తో కలిపేందుకు ఈ మార్పు చెందుతున్న ప్రయాణంలో భాగం కావాలని తమ భాగస్వాములను కోరినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్ధమైన వేళ.. ఇండియా పేరును (renaming India) భారత్‌గా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశం ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు (G20 Summit) సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ (President of India)కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ (President of Bharat) అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నరేంద్ర మోదీ సర్కార్ ఇండియా పేరును మార్చే ప్రతిపాదనను సభ్యుల ముందుంచనుందని ప్రచారంర నడుస్తోంది. రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియా పేరును భారత్ (Bharat)గా మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందని.. ఇండియా పేరు మార్చుతూ సభలో తాజా తీర్మానం ఆమోదించేందుకు మోదీ సర్కార్ పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ నుంచి జీ20 ప్రతినిధులకు అధికారిక సమాచారంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాసిఉండటం పేరు మార్పు ప్రతిపాదనకు బలం చేకూరుస్తోంది. అదేవిధంగా ఇటీవలే ముగిసిన జీ20 సదస్సులోనూ ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ ముందు టేబుల్‌పై దేశం నేమ్ ప్లేట్‌పై ఇండియాకు బదులు భారత్ అని కనిపించింది.
Also Read..
Nayanthara | మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి.. నయనతార పోస్ట్ వైరల్
Tamil Nadu Farmer | ఆవుని చంపాయని పులులపై ప్రతీకారం.. విషంపెట్టి చంపిన రైతు