ముంబై: హిందీ భాష అమలుపై మహారాష్ట్రలో వివాదం చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కలిసి పోరాడేందుకు సోదరులైన ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు. (Raj, Uddhav Thackeray) ఈ మేరకు వారిద్దరూ సంకేతం ఇచ్చారు. ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్‌తో పోడ్కాస్ట్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా మరాఠీ ప్రజల మధ్య ఐక్యత అవసరమని స్పష్టం చేశారు. మరాఠీ గుర్తింపు సమస్యలతో పోలిస్తే వ్యక్తిగత వివాదాలు చాలా తక్కువని అన్నారు.
కాగా, ఠాక్రే సోదరులిద్దరూ ఒక్కటయ్యే అవకాశం గురించి మంజ్రేకర్ అడిగిన ప్రశ్నకు రాజ్ ఠాక్రే సమాధానమిచ్చారు. ‘నాకు మహారాష్ట్ర సంక్షేమమే ప్రధానం, మిగతావన్నీ ఆ తర్వాతే. చిన్న చిన్న విభేదాలను నేను విస్మరిస్తా. ఉద్ధవ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. అదే చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడా అన్నది ఒక్కటే ప్రశ్న’ అని అన్నారు.
మరోవైపు రాజ్ ఠాక్రే వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే కూడా స్పందించారు. ఆయనతో కలిసి పని చేసేందుకు తాను కూడా సిద్ధమేనని తెలిపారు. ‘మరాఠీ భాష, మహారాష్ట్ర కోసం చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నా. కలిసి పనిచేయడానికి నేను సిద్ధమే. అయితే ఆయన (రాజ్ ఠాక్రే) ఇకపై మహారాష్ట్ర వ్యతిరేక వ్యక్తులు, పార్టీలకు మద్దతు ఇవ్వకూడదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ముందు ప్రమాణం చేయాలి’ అని అన్నారు. బీజేపీకి దూరంగా ఎంఎన్ఎస్ ఉండాలని పరోక్షంగా చెప్పారు.
मराठीसाठी आणि महाराष्ट्राच्या हितासाठी, मी किरकोळ भांडणं बाजूला ठेवायला तयार आहे. pic.twitter.com/SMU1Tq3s98
— ShivSena – शिवसेना Uddhav Balasaheb Thackeray (@ShivSenaUBT_) April 19, 2025