లక్నో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వచ్చే సాధారణ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేయడం లేదని, గత సాధారణ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీచేసి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినందున ఈసారి మరో స్థానానికి మారే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే అదంతా వట్టి ప్రచారమేనని యూపీ కాంగ్రెస్ నాయకులు కొట్టిపారేస్తున్నారు.
అమేథీ పార్లమెంట్ నియోజకవర్గం అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడైనా గాంధీల కుటుంబానికి చెందినదేనని కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ వ్యాఖ్యానించారు. 1967 నుంచి సంజయ్‌గాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇలా నలుగురు నెహ్రూ-గాంధీ కుటుంబసభ్యులు అమేథీకి ప్రాతినిధ్యం వహించారని చెప్పారు.
స్మృతి ఇరానీ లాంటి వాళ్లు మధ్యలో వచ్చినా మళ్లీ పోయేవాళ్లేనని అజయ్ రాయ్ వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ అమేథీ నుంచే పోటీ చేస్తున్నారని, అమేథీ ప్రజలు రాహుల్‌గాంధీ వెనకే ఉన్నారని ఆయన చెప్పారు.