Klor Anthony : ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ని ఓ అమెరికన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. భారత్ తనకు ఐదేళ్ల వీసా (Five year visa) ఇచ్చిందని చూపుతూ మోదీని మెచ్చుకున్నాడు. ఈ మేరకు అతను తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టాడు. ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్టుపై నెటిజన్ల నుంచి రకరకాల స్పందనలు వస్తున్నాయి.
అమెరికాకు చెందిన క్లార్ ఆంథోనీ లూయిస్ (Klor Anthony Louis).. భారత్ తనకిచ్చిన ఐదేళ్ల విసాను చూపుతూ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోకు క్యాప్షన్‌గా ప్రధాని మోదీపై ప్రశంసలను పెట్టారు. భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ ప్రతిభకు ద్వారాలు తెరిచారని, కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం విదేశీ ప్రతిభను దేశం నుంచి వెల్లగొడుతున్నారని క్లార్ విమర్శించారు.
క్లార్ పోస్టు వైరల్ అయ్యింది. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు వ్యంగ్యంగా, మరికొందరు హాస్యంగా, ఇంకొందరు గర్వంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇక బెంగళూరు కొత్త సిలికాన్ వ్యాలీలా, ముంబై కొత్త లాస్ఏంజెలస్లా, ఢిల్లీ కొత్త వాషింగ్టన్‌లా, కలకత్తా కొత్త న్యూయార్క్‌లా మారుతుంది’ అని ఓ నెటిజన్ వ్యంగ్య పోస్ట్ చేశాడు. ‘తొలిసారి భారత వీసా పొందినందుకు అభినందనలు’ అని మరో యూజర్ పేర్కొన్నాడు.
భారతదేశంలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు స్థాపించే విదేశీయుల కోసం భారత్ లాంగటర్మ్ B-1 వీసాలను జారీ చేస్తుంది. ఈ వీసా పారిశ్రామిక ఉత్పత్తులను, వాణిజ్య ఉత్పత్తులను భారత్ నుంచి కొనుగోలు చేయడానికి, భారత్‌లో అమ్ముకోవడానికి కూడా అనుమతి ఇస్తుంది. క్లార్ ఆంథోనికి భారత్ ఇచ్చింది ఇలాంటి లాంగ్ టర్మ్ వీసానే.