పాతానమిట్ట: కేరళలో 19 ఏళ్ల కోవిడ్ పేషెంట్‌ను అత్యాచారం చేసిన కేసులో అంబులెన్స్ డ్రైవర్(Ambulance Driver)కు జీవితఖైదు జైలుశిక్ష విధించారు. పాతానమిట్టలోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. 2020లో కోవిడ్ మహమ్మరి విజృంభించిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 2020లో 19 ఏళ్ల కోవిడ్ రోగిని కేర్ సెంటర్‌కు తరలించాల్సి వచ్చింది. అంబులెన్స్‌లో ఆమెను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దీని కోసం నౌఫాల్ అనే డ్రైవర్ విధుల్లో ఉన్నాడు. కోవిడ్ కేర్ సెంటర్‌కు పేషెంట్‌ను తరలిస్తున్న సమయంలో.. నిర్దేశిత రూట్ కాకుండా, ఆ డ్రైవర్ ఓ నిర్మానుష ప్రదేశం దిశగా వాహనాన్ని తీసుకెళ్లాడు. అక్కడ ఆ పేషెంట్‌పై లైంగికంగా దాడి చేశాడు.
దాడి చేసిన తర్వాత డ్రైవర్ నౌఫాల్ ఆ అమ్మాయికి క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. కోవిడ్ కేర్ సెంటర్లో డ్రాప్ చేయడానికి ముందు అతను సారీ చెప్పాడు. అతను సారీ చెబుతున్న సమయంలో బాధితురాలు ఆ మాటల్ని ఫోన్లో రికార్డు చేసింది. ఈ కేసు విచారణలో ఆ వీడియోనే కీలకంగా మారింది. కేర్ సెంటర్‌కు వచ్చిన తర్వాత అత్యాచార అంశాన్ని ఆరోగ్య శాఖ అధికారులకు చెప్పిందామె. ఈ విషయాన్ని పోలీసులకు అలర్ట్ చేశారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నౌఫాల్‌ను అరెస్టు చేశారు.