న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రముఖ ఆన్లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చినప్పటికీ ఆ సంఖ్య దాదాపు 20 వేల వరకు ఉండవచ్చని తాజాగా తెలుస్తున్నది. రానున్న నెలల్లో అమెజాన్ పలు ప్రాంతాల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల కార్మికులు, టెక్నాలజీ ఉద్యోగులు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు సహా దాదాపు 20 వేల మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధమున్న వ్యక్తులు వెల్లడించారని ‘కంప్యూటర్ వరల్డ్’ వెబ్సైట్ పేర్కొన్నది.
పనితీరు సరిగా లేని ఉద్యోగులను గుర్తించాలని అమెజాన్ ఇప్పటికే తమ మేనేజర్లకు స్పష్టం చేసిందని, తద్వారా దాదాపు 20 వేల మంది ఉద్యోగులపై వేటు వేసేందుకు అమెజాన్ సిద్ధమైందని ఆ వెబ్సైట్ తెలిపింది. ఇది అమెజాన్‌లోని మొత్తం 15 లక్షల మంది ఉద్యోగుల్లో దాదాపు 1.3 శాతానికి సమానం. వివిధ విభాగాల్లోని ఉద్యోగులను తొలగించేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నట్టు ఆ సంస్థ సీఈవో ఆండీ జెస్సీ ఇటీవల ధ్రువీకరించినప్పటికీ ఎంత మందిని తొలగించనున్నదీ వెల్లడించలేదు. కానీ, దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై వేటు వేయాలని అమెజాన్ యోచిస్తున్నట్టు ఆ సంస్థలోని అంతర్గత వర్గాల ద్వారా తెలిసిందని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక గత నెలలో పేర్కొన్న విషయం విదితమే.