న్యూఢిల్లీ, అక్టోబర్ 29 : ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది తన కార్పొరేట్ ఉద్యోగులకు మంగళవారం లేఆఫ్ ప్రకటించిన ఈ-కామర్స్, టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ అందులో భాగంగా భారత్‌లోని 800-1000 మంది కార్పొరేట్ ఉద్యోగులకు పింక్ స్లిప్పులు ఇచ్చే అవకాశం ఉంది. కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచడం, వ్యాపార ఖర్చులను తగ్గించడం వంటి చర్యల నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని కంపెనీ నిర్ణయించింది.
దాదాపు 30,000 మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వాలని భావిస్తున్న అమెజాన్ ఇందులో భాగంగా తొలిగా 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఈమెయిల్స్ జారీచేసింది. భారత్‌లో చేపట్టనున్న ఉద్వాసనలు ప్రధానంగా ఫైనాన్స్, మార్కెటింగ్, మానవ వనరులు, టెక్ విభాగాలలో జరిగే అవకాశం ఉనట్లు సంబంధిత వ్యక్తులు తెలిపారు. అమెజాన్‌కు చెందిన గ్లోబల్ టీమ్ పరిధిలో పనిచేసే ఉద్యోగులపైనే వేటు పడవచ్చని వారు చెప్పారు.