న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ బుధవారం భేటీ కావడంతో ఆయన కాషాయ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా తాను బీజేపీలో చేరతానని వచ్చిన వార్తల గురించి కెప్టెన్ సింగ్ వివరణ ఇచ్చారు.తాను కాషాయ పార్టీలో చేరబోనని, కాంగ్రెస్‌లో కూడా కొనసాగనని ఓ జాతీయ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.
తాను ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, తనను తీవ్ర క్షోభకు గురిచేసిన పార్టీలో ఇక ముందు కొనసాగబోనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశంతో పంజాబ్ సీఎంగా కెప్టెన్ వైదొలగిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం ఆ పార్టీలో కలకలం రేపింది. ఇక సీఎం చరణ్‌జిత్ సింగ్‌తో సిద్ధూ గురువారం భేటీ కానుండటంతో పంజాబ్ పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.