హైదరాబాద్, జూన్ 6 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందడం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటన నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్ పేరు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగిందని, పోలీసులు వద్దని వారించినా ఆయన కారులో పరేడ్ నిర్వహించారని ఆరోపిస్తూ ఆ హీరోను అరెస్ట్ చేశారు.
ఇప్పుడు కోహ్లీని చూడటానికే లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియానికి వచ్చారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారని అల్లు అర్జున్ అభిమానులు అంటున్నారు. మరి, తమ హీరోను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టే, ఇప్పుడు కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కోహ్లీని కూడా అరెస్ట్ చేస్తుందా? అని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటకు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తున్నది. కప్ గెలిచిన మరుసటి రోజే ఈవెంట్ నిర్వహణ వద్దని, భద్రత, లాజిస్టిక్ సమస్యలు తలెత్తుతాయని బెంగళూరు పోలీసులు ప్రభుత్వానికి ముందే సూచించారు. ఆదివారం వేడుకను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసుల విజ్ఞప్తిని పక్కనబెట్టిన ప్రభుత్వం.. ఈవెంట్ నిర్వహణకే మొగ్గుచూపింది. తక్కువ సమయం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయలేక, వచ్చిన రద్దీని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని వివరించింది. మరోవైపు, ఫైనల్ జరగడానికి ముందే ఈవెంట్ నిర్వహణ కోసం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్టు ఓ లేఖ తాజాగా బయటకు వచ్చింది. చివరి నిమిషంలో స్టేడియంలో వేడుకకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది కూడా ప్రమాదానికి కారణమైనట్టు సమాచారం.
తొక్కిసలాట ఘటనను సుమోటోగా తీసుకొన్న కర్ణాటక హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ దుర్ఘటనను ఆపలేకపోయారా? అని ప్రభుత్వ తీరుపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. పూర్తి నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. కాగా ఘటన సమయంలో వెయ్యి మంది పోలీసులే ఉన్నారని కోర్టులో ప్రభుత్వం చెప్పగా, 5 వేల మంది పోలీసులు ఉన్నారని బుధవారం డిప్యూటీ సీఎం శివకుమార్ చెప్పడం గమనార్హం. దీంతో కోర్టుకు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పిందని నెటిజన్లు మండిపడుతున్నారు. తొక్కిసలాటకు సంబంధించి నిర్లక్ష్యం వహించారన్న కారణంతో ఆర్సీబీ, కేఎస్‌సీఏపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు గురువారం బెంగళూరు పోలీస్ కమిషనర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
తొక్కిసలాట ఘటన జరిగి పలువురు చనిపోయారని తెలిసిన తర్వాత కూడా సీఎం సిద్ధరామయ్య బాదమ్ హల్వా, దోశ తినడానికి వెళ్లారని బీజేపీ మండిపడింది. బయట తొక్కిసలాట జరుగుతుంటే మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ కుమారుడు జైద్‌కు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తూ క్రికెటర్లతో వేదికపై అవకాశం ఇవ్వడమేంటని మండిపడింది. కన్నడ సర్కారు, ఆర్సీబీపై మృతుల కుటుంబసభ్యులు రూ. 100 కోట్ల దావా వేయాలని మాజీ క్రికెటర్ మదన్‌లాల్ అన్నారు. కాగా తొక్కిసలాటలో మరణించిన వారందరూ 40 ఏండ్లలోపు వారేనని, పిన్న వయస్కుడికి 14 ఏండ్లు కూడా ఉండవని పోలీసులు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డలను కోల్పోయామని బాధితుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.