లక్నో: అలహాబాద్ హైకోర్టు స్థానిక న్యాయవాది అశోక్ పాండేకు .. 2021 నాటి కోర్టు ధిక్కరణ కేసు(Contempt of Court)లో ఆర్నెళ్ల జైలుశిక్ష విధించింది. మెడ చుట్టు లాయర్ రోబ్ లేకుండా, షర్ట్‌కు బటన్ పెట్టుకోకుండా కోర్టుకు హాజరైన కేసులో.. అలహాబాద్ కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. జస్టిస్ వివేక్ చౌదరీ, బీఆర్ సింగ్‌లకు చెందిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఆరోపణలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కఠిన శిక్ష విధిస్తున్నట్లు కోర్టు చెప్పింది. గతంలో లాయర్ పాండే ప్రవర్తన సరిగా లేదని కోర్టు వెల్లడించింది
లాయర్ పాండేకు అలహాబాద్ కోర్టు జైలుశిక్షతో పాటు రెండు వేల జరిమానా కూడా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకుంటే, అప్పుడు అతని మరో నెల అదనపు జైలు శిక్ష వేయనున్నారు. నాలుగు వారాల్లోగా లక్నోలోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు సరెండర్ కావాలని కోర్టును లాయర్ పాండేను ఆదేశించింది. షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. అలహాబాద్ హైకోర్టు, లక్నో బెంచ్‌ల్లో లీగల్ ప్రాక్టీసు చేయకుండా ఎందుకు నిషేధం విధించరాదు అని కోర్టు ప్రశ్నించింది.
2021, ఆగస్టు 18వ తేదీన పాండే కోర్టుకు హాజరైన తీరు పట్ల అప్పటి న్యాయమూర్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాద దుస్తులు సరిగా లేవని ఆరోపించారు. జడ్జీలతో అతను దురుసుగా ప్రవర్తించినట్లు తేలింది. వాళ్లను గూండాలు అని అతను పిలిచాడు. కోర్టు ధిక్కరణ కేసు పట్ల న్యాయవాది పాండే స్పందిచలేదు.