అలహాబాద్: వచ్చే ఫిబ్రవరిలో ఐదు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలను వీలైతే రెండు నెలలు వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి (ఈసీ) సూచించింది. వైరస్ వ్యాప్తికి వాహకంగా మారే ర్యాలీలు, సమావేశాలపై నిషేధం విధించాలని పేర్కొన్నది. ప్రజలు ప్రాణాలతో ఉంటేనే ఎన్నికల ర్యాలీలు, సమావేశాలు జరుగుతాయని గుర్తు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. జీవించే హక్కు ప్రతీ ఒక్కరికి ఉన్నదని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌తో కూడిన బెంచ్ గుర్తు చేసింది. దేశంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రశంసించిన ధర్మాసనం.. యూపీ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసింది. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సభలు, సమావేశాలు, ర్యాలీలను నిర్వహించవద్దని కోరింది. ఓ వ్యక్తి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ సూచనలు చేసింది.
ఆ ఎన్నికలతోనే సెకండ్‌వేవ్
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికలు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశంలో సెకండ్‌వేవ్‌కు ఆజ్యం పోశాయని, వైరస్ కారణంగా వేలాదిమంది మృత్యువాతపడ్డారని కోర్టు గుర్తు చేసింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో థర్డ్‌వేవ్ విరుచుకుపడే సూచనలు కనిపిస్తున్నాయన్నది. కరోనా కేసుల పెరుగుదలతో చైనా, నెదర్లాండ్స్, జర్మనీ వంటి దేశాల్లో ఇప్పటికే పాక్షిక, సంపూర్ణ లాక్డౌన్ విధించారని తెలిపింది. యూపీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ర్యాలీలు, సభలు, సమావేశాల కోసం అన్ని రాజకీయ పార్టీలు లక్షలాది మందిని తరలిస్తున్నాయని, ఈ పరిస్థితుల్లో కొవిడ్ నిబంధనలు పాటించడం కుదరదని పేర్కొంది. దీన్ని సరైన సమయంలో నిలిపివేయకపోతే సెకండ్‌వేవ్ కంటే దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ఆ సమావేశాలు, ర్యాలీలను ఈసీ వెంటనే నిలిపివేయాలని, టీవీలు, వార్తా పత్రికల ద్వారా ప్రచారం చేసుకొనేలా రాజకీయ పార్టీలకు ఆదేశాలివ్వాలని సూచించింది.
వచ్చే వారం నిర్ణయం తీసుకొంటాం: సీఈసీ
ఒమిక్రాన్ కేసుల నేపథ్యంలో రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న అలహాబాద్ హైకోర్టు సూచనపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర శుక్రవారం స్పందించారు. వచ్చే వారం యూపీలో తాను పర్యటిస్తానని, అక్కడి పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీల ర్యాలీలపై తగిన నిర్ణయం తీసుకొంటానని తెలిపారు. ఫిబ్రవరిలో జరుగాల్సిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై మీడియా అడిగిన ప్రశ్నకు కూడా సుశీల్ స్పందించారు. ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం ఒమిక్రాన్ ఒక్క కేసే నమోదైందని, రాష్ట్రంలోని అర్హులందరూ కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ వేసుకున్నట్టు తెలిపారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకొంటామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో కొవిడ్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేస్తామని, ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్యను 1500 నుంచి 1200కు కుదించినట్టు పేర్కొన్నారు.
వార్తల్లో న్యాయమూర్తి