భోపాల్: మూడేళ్ల బాలికకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. శస్త్రచికిత్సతో పాటు చికిత్సలు విఫలమయ్యాయి. దీంతో మరణం అనివార్యమని భావించిన ఆ బాలిక తల్లిదండ్రులు జైన మతాచారాన్ని పాటించారు. స్వచ్ఛంద ఆమరణ నిరాహార దీక్షగా పేర్కొనే ‘సంతార’ వల్ల ఆ చిన్నారి మరణించింది. (Girl Dies of Jain ritual Santhara) మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. పియూష్, వర్ష జైన్ దంపతులు ఐటీ నిపుణులు. వారి మూడేళ్ల కుమార్తె వియానా జైన్‌కు గత ఏడాది డిసెంబర్లో బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లుగా వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. ఆ చిన్నారికి నిర్వహించిన సర్జరీ విఫలమైంది.
కాగా, ఆ కుటుంబం ఆధ్యాత్మిక మార్గం వైపు మొగ్గు చూపింది. మార్చి 21న జైన సన్యాసి రాజేష్ ముని మహారాజ్‌ను వారు సందర్శించారు. తల్లిదండ్రులైన పియూష్, వర్ష జైన్ అనుమతితో వారి కుమార్తె వియానా జైన్‌తో ‘సంతార’ ప్రతిజ్ఞ చేయించారు. దీంతో స్వచ్ఛంద ఆమరణ నిరాహార దీక్ష పాటించిన కొన్ని నిమిషాలకు ఆ చిన్నారి మరణించింది.
మరోవైపు ‘జైన ఆచారం ‘సంతార’ను ప్రతిజ్ఞ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా వియానాను ‘గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తించింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన ఈ జైన మతాచారం మరోసారి చర్చకు దారి తీసింది. కేవలం మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు లేదా బాగా వృద్ధప్యంలో ఉండి మతాచారాలు పాటించలేనప్పుడు, నయం కాని రోగంతో బాధపడుతున్నప్పుడు మాత్రమే ‘సంతార’ను ఆచరించాలని జైన మత గ్రంథాలు చెబుతున్నాయి.
కాగా, జైన మతాచారం ‘సంతార’ చట్టపరమైన సవాళ్లను కూడా ఎదుర్కొన్నది. సంతారను చట్టవిరుద్ధంగా పరిగణించాలని, భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 306 ప్రకారం ఆత్మహత్యతో సమానం చేయాలని 2015లో రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్వచ్ఛందంగా జీవితాన్ని ముగించాలన్న నిర్ణయం స్వీయ హాని అని ఆరోపించింది. దానిని మతపరమైన ఆచారంగా సమర్థించలేమని కోర్టు పేర్కొంది.
మరోవైపు రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై జైన సమాజం నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నెల తర్వాత ఈ తీర్పు ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. మత స్వేచ్ఛ రక్షణ కింద సంతారాను జైనులు కొనసాగించడానికి సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది.