Monkeypox | మంకీపాక్స్ ప్రపంచదేశాలను వణికిస్తున్నది. ఆఫ్రికా దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకు మంకీపాక్స్ పలు దేశాలకు సైతం విస్తరిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. మంకీపాక్స్‌పై భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన దవాఖానాల్లో బెడ్లను రిజర్వ్ చేయడంతో పాటు ప్రధాన ల్యాబ్‌లను సైతం అప్రమత్తం చేసింది. వ్యాధి నిర్ధారణకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో రోగులకు ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసింది.
చికిత్స చేయడంతో పరిశీలనలో ఉంచనున్నారు. ఢిల్లీ పరిధిలో పాజిటివ్ కేసులు నమోదైతే.. సదరు రోగులను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్పించనున్నారు. అలాగే, ఆల్ ఇంఇయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో ఐదు పడకలను రిజర్వ్ చేశారు. ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనిపించినా.. మంకీపాక్స్ అనుమానిత కేసులు వచ్చినా వారిని ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసిన బెడ్‌పై ఉంచి చికిత్స అందిస్తారు. ఢిల్లీలోని ఎయిమ్స్, రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ హాస్పిల్స్ను మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికారులు కోరారు. అలాగే, వైరస్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు అవసరమైన మార్గదర్శకాలను సైతం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ జారీ చేసింది.