న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) అసాధారణ అధికారాలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించిన పిల్‌ను విచారించడానికి కోర్టు అంగీకారం తెలిపింది. గతేడాది జూలైలో ఈడీ అసాధారణ అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. అయితే పౌర సమాజం, విపక్షాలు ఈడీకి ఉన్న అధికారాలను తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికే ఈడీ ద్వారా దాడులు చేయిస్తున్నదని.. ఇందుకు సంబంధించిన కేసుల్లో నేరారోపణ రుజువైన కేసులు తక్కువని విపక్షాలు వాదిస్తున్నాయి. ఇటీవల రాజ్యసభలో ఆర్థిక శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం గత ఎనిమిదేండ్లలో ఈడీ 3,010 మనీ లాండరింగ్ సోదాలను నిర్వహించగా, అందులో కేవలం 23 మంది నిందితులు మాత్రమే దోషులుగా తేలారు.