NSA : ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ దోవల్ (Ajit Doval) వివిధ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల (NSAs) తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులను మరింత రెచ్చగొట్టే ఉద్దేశం భారత్‌కు లేదని, పాకిస్థాన్ కవ్విస్తే మాత్రం ధీటుగా ప్రతీకార దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తన కౌంటర్ పార్ట్స్‌కు స్పష్టం చేశారు.
అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, సౌదీ అరేబియా, జపాన్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో ఇవాళ అజిత్ దోవల్ సమావేశమయ్యారు. పాకిస్థాన్‌లో, పాకిస్థాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై జరిపిన మెరుపు దాడుల గురించి వారికి వివరించారు. అదేవిధంగా రష్యా, ఫ్రాన్స్ జాతీయ భద్రతా సలహాదారులతో కూడా దోవల్ సమావేశమయ్యారు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మాక్రో రూబియో, యూకే జాతీయ భద్రతా సలహాదారు జొనాథన్ పొవెల్, సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహాదారు ముసైద్ అల్ ఐబన్, సౌదీ అరేబియా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌హెచ్ షేక్ తహనూన్, జపాన్ జాతీయ భద్రతా సలహాదారు మసటక ఒకానోతో దోవల్ భేటీ అయ్యారు. రష్యా జాతీయ భద్రతా సలహాదారు సెర్గీ షోల్గు, ఫ్రాన్స్ ప్రతినిధి వాంగ్ యీతో ఫోన్లో మాట్లాడారు.