న్యూఢిల్లీ, జూన్ 13: కొత్త ప్రభుత్వంలోనూ కీలక శాఖలను మళ్లీ పాత మంత్రులకే కేటాయించిన ప్రభుత్వం అధికారుల విషయంలోనూ ఆదే వైఖరిని అవలంబిస్తున్నది. అజిత్ దోవల్, పీకే మిశ్రా, అమిత్ ఖరే, తరుణ్ కపూర్ లాంటి కీలక ఉన్నతాధికారులను వారి పదవుల్లోనే కొనసాగిస్తున్నది. విశ్రాంత ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి నియమించింది. జూన్ 10 నుంచే ఈ నియామకం అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొన్నది.
ఈ పదవిలో అజిత్ దోవల్‌కు క్యాబినెట్ మంత్రి హోదా ఉండనుంది. ఇక, ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను మళ్లీ ఇదే పదవిలో నియమించింది. ఈ పదవుల్లో వీరు ప్రధానమంత్రి పదవీకాలం పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మరోవైపు మాజీ ఐఏఎస్ అధికారులు అమిత్ ఖరే, తరుణ్ కపూర్‌ను కూడా ప్రధానమంత్రి సలహదారులుగా మళ్లీ నియమించింది.