Ajay Maken quits | సీనియర్ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఏఐసీసీ రాజస్థాన్ రాష్ట్ర ఇంఛార్జీ పదవికి రాజీనామా చేశారు. మరికొన్ని రోజుల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో ప్రవేశిస్తుందనగా.. అజయ్ మాకెన్ రాజీనామా చేయడం పార్టీలో గందరగోళం నెలకొన్నది. అశోక్ గెహ్లాట్ వర్గానికి చెందిన వారిపై ఇప్పటివరకు పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన మల్లికార్జున ఖర్గేకు ఈ సమస్య కత్తిమీది సాములా మారింది. పార్టీలో అంతర్గతంగా ఎదురైన సమస్యను ఖర్గే ఎలా పరిష్కరిస్తారో అని పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సెప్టెంబర్ 25 న జైపూర్‌లో సమాంతర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్పీ) సమావేశాన్ని అశోక్ గెహ్లాట్ వర్గీయులు నిర్వహించారు. ఈ సమావేశాన్ని గెహ్లాట్‌కు ముగ్గురు విధేయులు బాధ్యతలు తీసుకున్నారని పార్టీకి ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. అయితే, వీరిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు లేనందున పార్టీ సీనియర్లు అధిష్ఠానంపై కినుకతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐఏసీసీ రాజస్థాన్ ఇంఛార్జీగా ఉన్న అజయ్ మాకెన్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, మాకెన్ రాజీనామాను ఖర్గే ఆమోదించలేదని, కొనసాగాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
రాజస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్, పార్టీ చీఫ్ విప్ మహేశ్ జోషి, రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్టీడీసీ) చైర్మన్ ధర్మేంద్ రాథోడ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోనందున రాజస్థాన్ ఇంఛార్జీ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదని మాకెన్ ఈ నెల 8న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాశారు. వారం రోజులు వేచిచూసిన మాకెన్ ఇప్పుడు రాజీనామా చేశారు. క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు అందజేసినప్పటికీ వారిపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేయడాన్ని మాకెన్ తప్పుపట్టారు. కనీసం వారితో క్షమాపణలు కూడా చెప్పించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇదే సమయంలో మరో వారం, పది రోజుల్లో రాజస్థాన్‌లో ప్రారంభం కానున్న రాహుల్ జోడో యాత్రకు ఇదే ముగ్గురు నాయకులకు యాత్రను సమన్వయం చేసే బాధ్యతలను అప్పగించడం కూడా మాకెన్‌కు నచ్చలేదు. దాంతో పార్టీ ఇంఛార్జీ పదవిలో కొనసాగేందుకు తన అయిష్టతను చూపుతూ రాజీనామా చేశారు.