న్యూఢిల్లీ: మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించినట్టు మంగళవారం అధికారిక ప్రకటన తెలిపింది. 2023 మే నుంచి జాతుల మధ్య ఘర్షణతో రగులుతున్న మణిపూర్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రాట్ నియమితులు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది జూలై 31న మణిపూర్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య స్థానంలో అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు.
అస్సాం-మేఘాలయ క్యాడర్‌కు చెందిన 1984 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ భల్లా 2024 ఆగస్టు వరకు దాదాపు ఐదేళ్లపాటు కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. కేరళ ప్రభుత్వంతో తరచూ ఘర్షణ వైఖరిని కొనసాగిస్తున్న ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ను బీహార్ గవర్నర్‌గా నియమించారు.
బీహార్ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా బదిలీ చేశారు. ఒడిశా గవర్నర్‌గా రఘువర్ దాస్ రాజీనామాను కూడా రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన స్థానంలో కంభంపాటి హరిబాబును నియమించారు. దీనికి ముందు హరిబాబు మిజోరం గవర్నర్‌గా ఉన్నారు. తాజాగా మిజోరం గవర్నర్‌గా మాజీ ఆర్మీ చీఫ్ డాక్టర్ వీకే సింగ్ నియమితులయ్యారు. గవర్నర్‌గా వీకే సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. వీకే సింగ్ గత మోదీ క్యాబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు.