Aishwarya Rai : ఆర్జేడీ అధినేత (RJD chief), బీహార్ మాజీ ముఖ్యమంత్రి (Bihar former CM) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) మరోసారి వార్తల్లో నిలిచారు. ఫేస్బుక్ (Face book) లో శనివారం ఆయన రిలేషన్షిప్ పోస్టు వైరల్ కావడం, దాంతో తండ్రి లాలూ యాదవ్ ఆదివారం ఆయనను పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కొన్నేళ్లుగా భర్త తేజ్‌ప్రతాప్‌కు దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ స్పందించారు. తేజ్ ప్రతాప్ రిలేషన్షిప్ గురించి ఆయన కుటుంబానికి ముందే తెలిసినప్పుడు తన జీవితాన్ని ఎందుకు నాశనం చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో అందరి పాత్ర ఉన్నదని, మీడియా ద్వారానే ప్రతి విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. తేజ్ ప్రతాప్ తనను కొట్టి, వేధించినప్పుడు వారి సామాజిక న్యాయం ఎక్కడికి పోయిందని నిలదీశారు.
వాళ్లకు ఇప్పుడు సామాజిక న్యాయం గుర్తొచ్చిందని ఎద్దేవా చేశారు. వాళ్లంతా ఒక్కటేనని, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఈ బహిష్కరణ నాటకం ఆడుతున్నారని, ఇందుకు రబ్రీదేవి పథకరచన చేసి ఉంటారని ఆరోపించారు. తన విడాకుల గురించి కూడా తనకు మీడియా ద్వారానే తెలిసిందని అన్నారు. ఏం జరిగిందో వాళ్లనే అడగాలని, తన జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఏముందని ఐశ్వర్య ప్రశ్నించారు.
తన భవిష్యత్తు గురించి కూడా వాళ్లనే అడగాలని మీడియాను కోరారు. కాగా శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో ఆ పోస్టులో ఉంది. ఆమె పేరు అనుష్క యాదవ్ అని, గత పన్నెండేళ్లుగా తాము రిలేషన్లో ఉన్నామని ఆమె పేర్కొన్నారు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అయితే ఈ పోస్టుపై ఎక్స్ వేదికగా ఆయన వివరణ ఇచ్చారు.
ఆ పోస్టు చేసింది తాను కాదని, తన సోషల్ మీడియా ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని తెలిపారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు పెట్టారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని చెప్పారు. ఆ పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు. అయినా లాలూ యాదవ్ కఠిన చర్యలు తీసుకున్నారు. తేజ్ ప్రతాప్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
తమ కుమారుడు వ్యక్తిగత జీవితంలో నైతిక విలువలను విస్మరించేలా చేస్తున్న చర్యలు.. సామాజిక న్యాయం కోసం పార్టీ చేస్తున్న సమష్టి పోరాటాన్ని బలహీనపరుస్తున్నాయని లాలూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. తేజ్ ప్రతాప్ ప్రవర్తన కుటుంబ విలువలు, సంప్రదాయాలకు అనుగుణంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై తేజ్ ప్రతాప్‌కు ఆర్జేడీ పార్టీలో, తమ కుటుంబంలో స్థానం లేదని స్పష్టం చేశారు.
కాగా తేజ్ ప్రతాప్ 2018 లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే వారి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు తాజా పరిణామాలు చోటుచేసుకోవడం ఈ ఏడాదిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమేనని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.