న్యూఢిల్లీ: హాంకాంగ్ నుంచి ఢిల్లీలోని ఎయిర్పోర్ట్లో మంగళవారం దిగిన ఏఐ 315 ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండ్ అయిన కొద్ది సేపటికి తోక భాగంలో మంటలంటుకున్నాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులు, విమాన సిబ్బంది ప్రమాద ఘటనకు ముందే విమానం నుంచి దిగిపోవటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
విమానం ఆక్సిలరీ పవర్ యూనిట్ (ఏపీయూ)లో మంటలు వ్యాపించాయని, ప్రయాణికులు విమానం నుంచి దిగిపోతున్న సమయంలో ఇది జరిగిందని ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. మంటల్లో విమానం బాగా కాలిపోయిందని, పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు సమాచారం.