న్యూఢిల్లీ, జూన్ 17: ఎయిరిండియా అందించిన భోజనంలో బ్లేడ్ రావడంతో ప్రయాణికుడు ఖంగుతిన్నాడు. తినే సందర్భంలో బ్లేడ్ (బ్లేడ్లాంటి ఇనుప ముక్క) గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. గతవారం బెంగళూరు నుంచి శాన్ఫ్రాన్సిస్కోకు ఎయిరిండియా ఏఐ175 విమానంలో వెళ్లిన మాథూర్స్ పాల్ అనే జర్నలిస్టుకు ఈ చెదు అనుభవం ఎదురైంది. ఇదే భోజనాన్ని చిన్నారులకు అందించి ఉంటే పరిస్థితి ఏమిటి? అని బాధితుడు ఎక్స్ వేదికగా నిలదీశాడు. దీనిపై ఎయిరిండియా స్పందించింది. సారీ చెప్పడంతోపాటు మరోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని పేర్కొన్నది. బాధితుడికి బిజినెస్ క్లాస్‌లో ప్రపంచంలో ఎక్కడికైనా వన్‌వే టికెట్ ఆఫర్ చేసింది. అయితే, ఎయిరిండియా ఆఫర్‌ను పాల్ తిరస్కరించారు. టికెట్‌ను లంచంగా అభివర్ణించారు.