పాట్నా: ఎయిర్ ఇండియా విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగ ఒక పక్షి దానిని ఢీకొట్టింది. దీంతో అధికారులు ఆ విమానాన్ని తనిఖీ చేశారు. ఆ విమానంలోని పయాణికులు సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. (Air India Flight) సోమవారం ఉదయం 7.44 గంటల సమయంలో ఢిల్లీ-పాట్నా ఎయిర్ ఇండియా విమానం ఏఐ 1741 పాట్నా విమానాశ్రయానికి చేరుకున్నది. అయితే 164 మంది ప్రయాణికులు ఉన్న ఆ విమానాన్ని ఒక పక్షి ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు రన్వే పై తనిఖీ నిర్వహించారు. ఈ సంఘటన కారణంగా విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలుగలేదని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని తెలిపారు.
కాగా, ముఖ్యంగా వర్షాకాలంలో పక్షుల సంచారం ఎక్కువగా ఉన్నప్పుడు విమానాలను పక్షులు ఢీకొట్టడం అసాధారణమేమీ కాదని ఎయిర్పోర్ట్ అధికారి తెలిపారు. విమానాశ్రయం పరిసరాల్లో పక్షులు, జంతువుల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక కమిటీ నెలవారీ తనిఖీలు నిర్వహిస్తుందని చెప్పారు. తనిఖీల మేరకు నివేదికలను సిద్ధం చేసి వాటి నివారణకు చర్యలు చేపడతామని ఆ అధికారి వివరించారు.