న్యూఢిల్లీ: సామూహిక సిక్ లీవ్‌లో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) సిబ్బంది ఎట్టకేలకు విధుల్లో చేరారు. దీంతో విమాన సేవల పరిస్థితి మెరుగుపడుతున్నది. మంగళవారం నాటికి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆ సంస్థ తెలిపింది. అనారోగ్యం కారణాలతో సామూహికంగా సెలవుల్లో ఉన్న క్యాబిన్ సిబ్బంది అంతా శనివారం విధుల్లో చేరినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ తెలిపింది. కంపెనీ షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్‌లో లోపం కారణంగా, సిబ్బంది అనారోగ్యంతో సెలవుల్లో ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేసింది.
కాగా, టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ప్రతిరోజూ సుమారు 380 విమాన సర్వీసులను నడుపుతోంది. అయితే క్యాబిన్ సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ పెట్టడంతో సుమారు వంద వరకు విమాన సర్వీసులు రద్దు చేసింది. ఆదివారం కూడా 20 విమానాలు రద్దయ్యాయి.
మరోవైపు గురువారం ఢిల్లీలో చీఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సామరస్యపూర్వక సమావేశం తర్వాత క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించారు. దీంతో 25 మంది సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖలను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉపసంహరించుకుంది. సిబ్బంది అంతా శనివారం నుంచి విధులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాటికి పరిస్థితి పూర్తి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారి తెలిపారు.