Air India Crash | హైదరాబాద్, జూన్ 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన ఎయిరిండియా విమానం మేఘానినగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ భవనాలపై కుప్పకూలింది. దీంతో భారీయెత్తున మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకొన్నది. భవ నం పైకప్పు, గోడలు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో భోజనం చేస్తున్న నలుగురు మెడికో విద్యార్థులు, ఒక డాక్టర్ భార్య మరణించగా, ఇద్దరు విద్యార్థులు, ముగ్గురు డాక్టర్ బంధువులు గల్లంతయ్యారు. 19 మం ది గాయపడగా, వారిలో ఐదుగురికి తీవ్ర గా యాలయ్యాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
విమానం కూలిన శబ్దా న్ని వినగానే ‘భూకంపం వచ్చిందా?’ అని తా ము భయపడిపోయామని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. గాయపడ్డ విద్యార్థులకు స్థానికులు ఒకవైపు సహాయక చర్యలు అందిస్తూనే మరోవైపు అధికారులకు సమాచారమిచ్చారు. ప్రమాదం గురించి తెలియగానే 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 బీఎస్ఎఫ్ యూనిట్లు, పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్య లు చేపట్టాయి. హాస్టల్లోని క్షతగాత్రులకు వేగవంతమైన వైద్య చికిత్స అందించడానికి గ్రీన్ కారిడార్‌ను అధికారులు ఏర్పాటు చేశారు.
విద్యార్థులు భోజనాలు చేస్తున్న సమయం లో ప్రమాదం జరుగడంతో మెస్‌లో ప్లేట్లు, ఆహారం చిందరవందర గా పడ్డాయి. విమానం తో క భాగం బిల్డింగ్‌లోకి చొ చ్చుకుపోయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. మెడికల్ కాలేజీ హాస్టల్ మెస్‌లోకి తొలు త దూసుకుపోయిన విమానం ఆ తర్వాత సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉండేటువంటి అతుల్యమ్ హాస్టల్లోకి కూడా చొచ్చుకుపోయినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. కూలిపోవడాని కంటే ముందు విమానం చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించినట్టు హరీశ్ షా అనే వ్యక్తి పీటీఐతో అన్నారు.
ఎప్పటిలాగే భోజనాల సమయమయ్యిందని ఆ మెడికో విద్యార్థులు ప్లేట్లలో కిచిడీ, చారు, పెరుగు వగైరా పెట్టుకొని టేబుల్స్ మీద కూర్చున్నారు. స్నేహితులతో ముచ్చట్లలో మునిగిపోతూ తినడం ప్రారంభించారు. ఇంతలో పైనుంచి నిప్పులు, రాళ్ల వర్షం కురిసింది. రెప్పపాటులోనే ఐదంతస్తుల హాస్టల్ భవనం కంపించిపోయింది. అప్పటివరకూ తమతో మాట్లాడిన స్నేహితులు విగత జీవులుగా కనిపించారు. ఎక్కడ చూసినా మృతదేహాలు.. క్షతగాత్రుల హాహాకారాలు.. ఇదీ గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలి పడిపోయిన బీజే మెడికల్ కాలేజీ యూజీ హాస్టల్ దగ్గరి పరిస్థితి.. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా.. ఐదుగురు గల్లంతయ్యారు. 19 మంది గాయపడ్డారు.
అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన తీరు, అక్కడి హృదయవిదారకమైన పరిస్థితులను ప్రత్యక్ష సాక్షులు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వాళ్లు వెల్లడించిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ప్రమాద సమయంలో ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్దం వచ్చిందని, ఆకాశమంతా దట్టమైన పొగతో కమ్ముకుందని కొందరు సాక్షులు చెప్పారు. ఘటనస్థలానికి వెళ్లి చూడగా విమాన శకలాలు, చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయని వెల్లడించారు. ఇంట్లో ఉండగా భారీ శబ్దం వచ్చిందని, భూకంపం వచ్చిందేమోనని అనుకున్నామని, బయటకు వచ్చి చూస్తే మొత్తం నల్లటి పొగ వ్యాపించి ఉందని మరికొందరు తమ అనుభవాన్ని పంచుకున్నారు. మా కుమారుడు ఉన్న మెడికల్ కాలేజీ హాస్టల్పైనే విమానం పడిపోయింది. మా అబ్బాయితో మాట్లాడాను. రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడని, స్వల్ప గాయాలయ్యాయని తెలిపాడు. మా కుమారుడు సురక్షితంగానే ఉన్నా డు అని రమీలా అనే మహిళ వివరించారు.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కూలిన ప్రాంత విహంగ వీక్షణం, కొనసాగుతున్న సహాయక చర్యలు, గుమికూడిన స్థానికులు
అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ హాస్టల్ లోపలి వైపు, పై భాగాన కూరుకుపోయిన ఎయిర్ ఇండియా విమాన శకలాలు. హాస్టల్ సమీపంలో కాలి పడిపోయిన మరో విమాన శకలం
అహ్మదాబాద్ విమానాశ్రయంలోని సీసీటీవీ క్యాప్చర్ చేసిన 32 సెకండ్ల నిడివిగల ఫుటేజ్‌లో ఎయిరిండియా విమానం ఏ విధంగా కూలిపోయిందో కనిపించింది. ల్యాండింగ్ గేర్స్ రన్‌వేను వదిలిపెట్టినప్పటి నుంచి విమానం కూలిపోయే వరకు దీనిలో కనిపించింది. ఇది రన్‌వేపై సక్రమంగానే వేగాన్ని అందుకుంది. అప్పుడు అంతా సజావుగానే ఉన్నట్లు అనిపించింది. టేకాఫ్ అయిన కొద్ది సెకండ్లకే ఆ విమానం ఇబ్బందుల్లో ఉన్నట్లు స్పష్టమైపోయింది.
టేకాఫ్‌లో సమస్యలు తలెత్తి విమానం లిఫ్టింగ్‌లో అంతరాయం కలిగిందని, దీంతో కిందనున్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు వైమానిక రంగ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పక్షులు ఢీకొట్టిన కారణంగా విమానం తగినంత వేగాన్ని అందుకోలేక కూలిపోయి ఉండొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే, దర్యాప్తులోనే అన్ని విషయాలు బయటపడొచ్చని చెప్తున్నారు.
ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాద స్థలిలో చెల్లాచెదురుగా పడి ఉన్న విమాన చక్రం, ప్రమాదం జరిగిన భవనం వద్ద గుమికూడిన స్థానికులు, శకలాల నుంచి వెలువడుతున్న పొగలు