న్యూఢిల్లీ, జూలై 29 : గత సంవత్సరం 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిరిండియా విమాన దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు తుది దశకు వచ్చినట్టు కేంద్రం తెలిపింది. ప్రమాదానికి గురైన విమానంలో ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ మెకానిజంలో ఎటువంటి లోపమూ దర్యాప్తు అధికారులు గుర్తించలేదని బుధవారం పార్లమెంట్లో వెల్లడించింది.
రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి మురళీధర్ మోహోల్ సమాధానమిస్తూ, ఒరిజనల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరర్ నిర్వహించిన అధునాతన పరీక్షల అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ప్రభుత్వం పేర్కొన్నది. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) తుది నివేదిక ఆలస్యం కాలేదని, ఎయిరిండియా దుర్ఘటనపై దర్యాప్తు ఇప్పుడు తుది దశలో ఉందని తెలిపింది.