హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ దుర్ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నదని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి పేర్కొన్నారు. ఏ చిన్న ఆధారాన్ని కూడా వదిలేది లేదని, కారణాలపై ఇప్పుడే అంచనాకు రాలేమని చెప్పారు. నిపుణుల కమిటీ అన్ని కోణాలను పరిశీలిస్తున్నదని తెలిపారు. ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం జరిగిన ఫ్లైట్ క్యాడెట్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వాయుమార్గ ప్రయాణాలపై సమీక్ష అవసరం
‘సీడీఎస్ రావత్ మరణం దురదృష్టకరం. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్నది. ప్రమాద కారణాలపై లోతుగా విశ్లేషిస్తున్నాం. దర్యాప్తు కమిటీలో హెలికాప్టర్లు నడపడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులు ఉన్నారు. వారు అన్ని విషయాలపై దృష్టిపెట్టారు. ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించి విశ్లేషిస్తున్నాం. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల్లో ఉన్న వ్యక్తులను గుర్తించి వారినుంచి వివరాలు సేకరిస్తున్నాం. దర్యాప్తునకు ఎంత సమయం పడుతుందో చెప్పలేం’ అని వివరించారు. వాయుమార్గ ప్రయాణాలకు సంబంధించిన ప్రొటోకాల్స్‌ను పునః సమీక్షించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కాగా, గల్వాన్ ఘటన తర్వాత పాకిస్థాన్, చైనా నుంచి సరిహద్దుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేసినట్టు వెల్లడించారు. తూర్పు లఢక్‌లో ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో 32 భారత్‌కు చేరాయని, మిగిలినవి అతి త్వరలోనే వస్తాయని వివరించారు. ఇటీవల డ్రోన్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో యాంటీడ్రోన్ టెక్నాలజీ అభివృద్ధి చేసేలా స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు.