న్యూఢిల్లీ: ఇన్ని రోజులు ఐఐటీ స్టూడెంట్లు జేఈఈ ర్యాంకు అనేది తమ కష్టానికి ప్రతిఫలంగా భావించేవారు. కానీ ఇక నుంచి అది ఐఐటీ కాలేజీల గేటు వద్దే ముగిసేలా కనిపిస్తున్నది. ఎందుకంటే జేఈఈ ర్యాంకులు, గేట్ స్కోర్లు, పర్సంటైల్‌ను ఇక నుంచి కాలేజీ ప్లేస్మెంట్లలో చూపించొద్దని ఆల్ ఐఐటీస్ ప్లేస్మెంట్ కమిటీ (ఏఐపీసీ) దేశంలోని 23 ఐఐటీల స్టూడెంట్లను ఆదేశించింది. స్టూడెంట్లు వారి రెజ్యూమేలలో జేఈఈ ర్యాంకుల వివరాలను అస్సలు ఉంచొద్దని తెలుపడం చర్చనీయాంశంగా మారింది. 23 ఐఐటీల బాడీ మీటింగ్‌లో ఏఐపీసీఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలున్నాయని ఏఐపీసీ కన్వీనర్ జాన్ జోస్ వెల్లడించారు. ఐఐటీల్లో రిజర్వేషన్ల ద్వారా సీట్లు పొందిన విద్యార్థులపై వివక్షను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్లలో చాలా కంపెనీలు జేఈఈ ర్యాంకులను బట్టి స్టూడెంట్లు రిజర్వేషన్ల ద్వారా వచ్చిన వారని తెలుసుకుని వారి స్కిల్స్, ఆశయాలను తక్కువ అంచనా వేస్తున్నాయని చెప్పారు.
ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది కేవలం ఒక నిర్దిష్ట సమయాన్ని మాత్రమే సూచిస్తుందని.. కానీ ఐఐటీ చదువు విద్యార్థి స్కిల్స్‌ను పెంచుతుందన్నారు. స్టూడెంట్లు వారి స్కిల్స్, చదువులో సాధించిన విజయాల ద్వారా ఎంపికవ్వాలి తప్ప జేఈఈ ర్యాంకులను బట్టి కాదని జాన్జోస్ వెల్లడించారు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.