న్యూఢిల్లీ: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు(Digital Personal Data Protection Bill)ను ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీలు డేటా ప్రొటెక్షన్ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ పేర్కొన్నారు. సమాచార హక్కు, ప్రైవసీ హక్కులను ఆ బిల్లుతో కాలరాసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపాలని, లేదా దీనిపై చర్చ చేపట్టాలని ఆయన కోరారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కేవలం ద్రవ్య బిల్లు మాత్రమే అని, అది చాలా నార్మల్ బిల్లు అని కేంద్ర మంత్రి వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ బిల్లులో వ్యక్తిగత స్వేచ్ఛ ఉన్న కారణంగా దానిపై తొందరపాటు వద్దు అని విపక్ష ఎంపీలు తెలిపారు.