Asaduddin Owaisi | ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. సామాన్యుడి పరిస్థితి ఏంటని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓ వైపు ముస్లింల ఇండ్లపు బుల్డోజర్లు ప్రయోగిస్తూనే.. మరో వైపు ఎంపీ ఇండిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని మండిపడ్డారు. తాను నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందానని, కొన్ని రోజులుగా తన ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారని ఆరోపించారు.
రాళ్ల దాడితో తనకు భయం లేదని, దాని ప్రభావం దేశంపై పడదన్నారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే స్పందన మరోలా ఉండేదన్నారు. ఇది ఏమాత్రం దేశానికి మంచిది కాదన్నారు. ఈ సందర్భంగా హర్యానా నూహ్ హింసాకాండపై సైతం ఆయన స్పందించారు. స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై మాట్లాడతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నామని, దేశ ప్రజలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారన్నారు. తాము హింసను ఖండిస్తున్నామని, అయితే ఓ వర్గానికి సామూహిక శిక్షను విధిస్తున్నారని ఆరోపించారు.
ప్రధానమంత్రి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నించారు. దేశంలో కోర్టులు.. చట్టాలు లేవా?.. అవసరమైన ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం లేదా? అన్నారు. బుల్డోజర్లతో కూల్చివేతలు యూపీ, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్‌లోనే జరుగుతున్నాయన్న ఎంపీ.. మీరే చట్టం, కోర్టులుగా తీర్పులు ఇస్తే.. సీఆర్పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానంలో కేంద్రమంత్రి అమిత్‌షా మూడు బిల్లులను ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి దీనిపై బలమైన సందేశాన్ని ఇస్తారని ఆశిస్తున్నానని, ఎందుకంటే ఎన్నికలకు ముందు ఆయనకు ఇదే చివరి ప్రసంగమని ఎంపీ పేర్కొన్నారు.