చెన్నై, మే 13: పార్టీపై తిరుగుబాటు చేసి అధికార పార్టీకి మద్దతు పలికిన రెబల్ ఎమ్మెల్యేలను ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి బుధవారం బహిష్కరించారు. వీరిలో మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సీవీ షణ్ముగన్, సీ విజయ్‌భాస్కర్ తదితరులు ఉన్నారు. వీరిని పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.
విప్ జారీ చేసినప్పటికీ, పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా బుధవారం శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేకు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు 25 మంది మద్దతు పలికిన కొన్ని గంటలకే వారిని తొలగిస్తున్నట్టు పళనిస్వామి తెలిపారు.
ఆయన తన వ్యూహాత్మక చర్యలో భాగంగా మాజీ మంత్రి, అతని సన్నిహితుడు పీ తంగమణి, పలువురు సీనియర్ నేతలను పార్టీ నుంచి తొలగించారు. అంతే కాకుండా ఆ స్థానాలను వేరే వ్యక్తులతో భర్తీ చేసి వారికి పార్టీ నుంచి బలమైన సందేశాన్ని పంపారు. కాగా, విజయ్ పార్టీకి ఓటు వేసిన 25 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌కు పళనిస్వామి విజ్ఞప్తి చేస్తారని భావిస్తున్న తరుణంలో ఈ పార్టీ నేతల బహిష్కరణ ఉత్తర్వు వెలువడింది. కాగా, తమను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని రెబల్ నేత షణ్ముగం అపహాస్యం చేశారు.