DGCA | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ 787, 737 విమానాల ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టాలని సూచించింది. ఈ నెల 21 నాటికి తనిఖీలు పూర్తి చేయాలని చెప్పింది. ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు డీసీసీఏ తెలిపింది. పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ఈ విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపాలను గుర్తించారు. దీంతో భద్రతకు ముప్పు కలిగించనున్నది. ఎమిరేట్స్ సహా పలు విదేశీ ఎయిర్ లైన్స్ కంపెనీలు ఇప్పటికే బోయింగ్ విమానాల్లో తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే.
అదే సమయంలో ఇప్పటివరకు ఎలాంటి తీవ్రమైన సాంకేతిక సమస్యలు కనిపించలేదని, కాబట్టి తప్పనిసరి ఉత్తర్వు జారీ చేయాల్సిన అవసరం లేదని అమెరికా ఎఫ్ఏఏ పేర్కొంది. ఈ వ్యవస్థ విమానం ఇంజిన్‌కు ఇంధన సరఫరాను నియంత్రిస్తుంది. దాంట్లో ఏదైనా సమస్య ఉటే ఇంజిన్ ఆగిపోవడం.. ఇంధన సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. దీన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ అన్ని వియానయాన సంస్థలను బోయింగ్ 787, 737 విమానాల్లో తనిఖీలు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏదైనా విమానంలో లోపాలు గుర్తిస్తే వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పింది. ప్రస్తుతం భారత్‌లోని ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్పెస్స్, ఆకాశ ఎయిర్ లైన్స్, స్పైస్‌జెట్ తదితర కంపెనీలు బోయింగ్ 737, 787 విమానాలను నడుపుతున్నాయి.
గత నెల 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేసి ఏఏఐబీ ఇంధన సరఫరా ఆగిపోయినందు వల్లే బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం రెండు ఇంజిన్లు టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే ఆగిపోయాయని తన ప్రాథమిక నివేదికలో తెలిపింది. ఎయిర్ ఇండియా విమానం బ్లాక్ బాక్స్ విశ్లేషణలో ఓ పైలట్ మరో పైలట్‌ను ఇంధన స్విచ్ ఎందుకు ఆఫ్ చేశాడని అడిగినట్లుగా కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ వెల్లడించిందని తేలింది. అయితే, సదరు పైలట్ తాను ఆఫ్ చేయలేదని బదులిచ్చినట్లుగా పలు నివేదికలు తెలిపాయి. అయితే, టేకాఫ్ అయిన తర్వాత వెంటనే ఇంధన స్విచ్‌లను కటాఫ్‌కు మార్చారని.. విమానం ఇంజన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడంతో ప్రమాదం జరిగినట్లు ఏఏఐబీ నివేదిక పేర్కొంది. దాంతో బోయింగ్ విమానాల్లోని ఇంధన స్విచ్‌లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.