అహ్మాదాబాద్: అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ(Vijay Rupani) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆయకు ఎప్పుడూ కలిసి వచ్చే లక్కీ నెంబర్.. ఈ సారి మాత్రం ఆయన ప్రాణాలనే బలితీసుకున్నది. మాజీ సీఎం విజయ్ రూపానీ 1206ను.. లక్కీ నెంబర్‌గా భావిస్తారు. ఆయన తన అన్ని వాహనాలకు ఆ నెంబర్‌నే ఎంపిక చేసుకుంటారు. స్కూటర్ల నుంచి కార్ల వరకు.. ఆయన వాహనాలను అన్నింటికీ 1206 నెంబరే ఉంటుంది. కానీ ఈ నెంబర్ మాత్రం గురువారం విజయ్ రూపాకీని కలిసి రాలేదు. అదృష్ట సంఖ్య కాస్త దురదృష్ట దినంగా మారింది. జూన్ 12వ తేదీన ప్రమాదం జరగడం వల్ల.. ఆ తేదీని ఆంగ్లంలో రాస్తున్నప్పడు 12-06గా రాస్తాము. అయితే రూపానీ లక్కీ నెంబర్.. ఆయన చనిపోయిన రోజు కూడా ఒకే సంఖ్యలా ఉన్నాయి.
లండన్‌లో ఉన్న కూతుర్ని కలిసేందుకు గుజరాత్ మాజీ సీఎం డ్రీమ్‌లైనర్ విమానం ఎక్కారు. అప్పటికే లండన్‌కు ఆయన భార్య చేరుకున్నది. పంజాబ్ ఇంచార్జీ మంత్రిగా ఉండడం వల్ల.. అక్కడ లుథియానా వెస్ట్ బైపోల్ కోసం ఆయన కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది. దీంతో భార్యతో కలిసి గతవారం ఆయన వెళ్లలేకపోయాడు. గురువారం విమానం ఎక్కగా .. అది కూలిన విషయం తెలిసిందే. విమానంలో 242 మంది ఉండగా, దాంట్లో 241 మంది మరణించారు. అందులో మాజీ సీఎం రూపానీ కూడా ఉన్నారు. 2016 ఆగస్టు నుంచి 2021 సెప్టెంబర్ వరకు గుజరాత్ సీఎంగా రూపానీ బాధ్యతలు నిర్వర్తించారు. విజయ్ రూపానీ సతీమణి లండన్ నుంచి ఇవాళ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు.
787-8 బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానంకు చెందిన బ్లాక్ బాక్సు ఇంకా దొరకలేదు. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా వద్ద ఉన్న డ్రీమ్‌లైనర్ మోడల్ విమానాలను అన్నింటినీ గ్రౌండ్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.