న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి భారీ షాక్ తగిలింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు పలువురు ఆప్ నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. (AAP Leaders Join BJP) ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా సమక్షంలో ఆదివారం ఆప్ నేతలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరారు. మోడల్ టౌన్ నియోజకవర్గంలోని కమలా నగర్ వార్డు నుంచి రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన కపిల్ నాగర్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. అలాగే ఆప్‌కు చెందిన వంద మందికిపైగా కార్యకర్తలు బీజేపీలో చేరారు.
మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేష్ బిధురి సమక్షంలో అనేక మంది ఆప్ కార్యకర్తలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ సీటు నుంచి తలపడుతున్న సీఎం అతిషిపై రమేష్ బిధురి మండిపడ్డారు. నియోజకవర్గం ఓటర్లను ఆమె పట్టించుకోలేదని విమర్శించారు. పలు సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కాగా, ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఒకే దశలో పోలింగ్ జరుగనున్నది. ఫిబ్రవరి 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.