న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర సర్కార్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. బర్త్ సర్టిఫికేట్(Birth Certificates) జారీ కోసం ఆధార్ కార్డులను ప్రూఫ్‌గా ఆమోదించబోమని ఆ రాష్ట్రాలు పేర్కొన్నాయి. ఆధార్ కార్డుకు బర్త్ సర్టిఫికేట్‌ను జోడించడం లేదని, దాన్ని జన్మ ద్రువీకరణ పత్రంగా భావించడం లేదని యూపీ ప్లానింగ్ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఆధార్ కార్డును జనన ద్రువీకరణ పత్రంగా లేదా, డేట్ ఆఫ్ బర్త్‌కు ప్రూఫ్‌గా ఆమోదించడం లేదని ప్లానింగ్ శాఖ స్పెషల్ సెక్రటరీ అమిత్ సింగ్ బన్సాల్ తెలిపారు.
మహారాష్ట్ర సర్కారు కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది. బర్త్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు ఆధార్ కార్డును ఓ డాక్యుమెంట్‌గా ఆమోదించబోమని ప్రభుత్వం చెప్పింది. జనన, మరణ రిజిస్ట్రేషన్ సవరణ చట్టం 2023 తర్వాత ఆధార్ కార్డు ఆధారంగా నమోదు అయిన బర్త్ సర్టిఫికేట్లను రద్దు చేయనున్నట్లు మహారాష్ట్ర సర్కారు వెల్లడించింది. అక్రమంగా జరుగుతున్న నకిలీ జనన, మరణ ద్రువపత్రాల జారీని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
ఆధార్ కార్డులతో అనుమానాస్పద రీతిలో జారీ చేసిన అన్ని సర్టిఫికేట్లను రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర రెవన్యూ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే తెలిపారు. ఇప్పటి వరకు నకిలీ జనన పత్రాలు జారీ చేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.