న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి ఎట్టకేలకు అధికారిక నివాసంగా సివిల్ లైన్స్ బంగ్లాను కేటాయించారు. ఈ మేరకు పీడబ్ల్యూడీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇదే నివాసంలో ఉండేవారు. ఆయన రాజీనామా చేసిన తర్వాత అతిశీ ఈ భవనానికి మారారు. అయితే, లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆదేశాలతో తన సామాన్లను బంగ్లా నుంచి బయటకు విసిరేశారని అతిశీ ఆరోపించారు. దీనిపై ఆప్ – బీజేపీ మధ్య రాజకీయ వివాదం నెలకొన్నది. దీంతో ఎట్టకేలకు ఇదే బంగ్లాను అతిశీకి అధికారికంగా కేటాయించారు. 15 రోజుల్లో ఈ భవనంలోకి మారాలని, ఈ భవనానికి సంబంధించిన కేసుల విచారణకు సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.