ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు పలు ములుపులు తిరుగుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో ఆ పార్టీకి చెందిన 40 మందికిపైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి అస్సాం రాజధాని గౌహతిలో మకాం వేశారు. దీంతో శివసేన చీలికదశకు చేరగా, ఆ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్, గురువారం కీలక ప్రకటన చేశారు. రెబల్స్ ఎమ్మెల్యేలు ముంబైకి తిరిగి వచ్చి సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో చర్చిస్తే ఎంవీఏ కూటమిని వీడేందుకు కూడా సిద్ధమని అన్నారు.
కాగా, సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కలత చెందింది. శివసేన ఎవరితోనైనా వెళ్లవచ్చని, దీని వల్ల కాంగ్రెస్కు ఎలాంటి సమస్య లేదని ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే అన్నారు. బీజేపీని అధికారంలోకి రాకుండా ఆపేందుకే తాము శివసేనతో కలిసి ఉన్నామని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) వల్లే ఈ గేమ్ జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బలపరీక్షకు సిద్ధంగా ఉందన్నారు. అయితే తాము ఎంవీఏతోనే ఉన్నామని అలాగే ఉంటామని అన్నారు. ‘వారు (శివసేన) ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలనుకుంటే మాకు ఇబ్బంది లేదు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు శివసేనలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గురువారం కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. ముంబైలోని సహ్యాద్రి అతిథి గృహంలో జరిగే ఈ మీటింగ్కు కాంగ్రెస్ సీనియర్ నేతలు హెచ్కే పాటిల్, బాలాసాహెబ్, నానా పటోలే, అశోక్ చవాన్ తదితరులు హాజరుకానున్నారు. అయితే సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు చివరి వరకు మద్దతుగా ఉంటామని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టం చేశాయి.