న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ కఠిన వైఖరి అవలంబిస్తున్నది. ఇందులో భాగాంగా ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది. తాజాగా పాకిస్థాన్ షిప్‌లు భారత జలాలతోపాటు పోర్టుల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించింది. (Pakistan Ships Banned) పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ శనివారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘పాకిస్థాన్ జెండా కలిగిన ఓడలు భారతదేశంలోని ఏ పోర్టులోకి ప్రవేశించడానికి అనుమతించబోం. అలాగే భారతీయ షిప్‌లు పాకిస్థాన్‌లోని ఏ పోర్టును సందర్శించకూడదు’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది.
కాగా, జాతీయ భద్రతా సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘భారతీయ ఆస్తుల భద్రత, సరుకు రవాణా, అనుసంధాన మౌలిక సదుపాయాల ప్రయోజనాల కోసం, భారత షిప్పింగ్ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ చర్య తీసుకున్నాం’ అని ఆ ఉత్తర్వులో పేర్కొంది. అయితే పాకిస్థాన్ నుంచి అన్ని దిగుమతులను నిషేధించిన తర్వాత ఆ దేశ కార్గో నౌకలను కూడా భారత్ నిషేధించింది.